ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని కొద్దికొద్దిగా చంపేస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీఐ వెబ్‌సైట్‌నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అదృశ్యమైనట్లు నివేదించబడిన విషయంపై… ఇది పైన కనిపించే విషయం మాత్రమేనని, అంతర్గత విధ్వంసం చాలా లోతుగా ఉంటుందన్నారు మల్లికార్జున్ ఖర్గే. మోదీ సర్కారు ఆర్టీఐ చట్టాన్ని కొంచెం కొంచెంగా చంపేస్తోందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇది రాజ్యాంగ హక్కులపై (ప్రజల) దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో మరో అడుగు” అని ట్విటర్ వేదికగా మల్లికార్జున్ ఖర్గే హిందీలో పోస్ట్ చేశారు.
సమాచార రక్షణ చట్టం ముసుగులో ఆర్టీఐ చట్టానికి ప్రతిపాదించిన సవరణ “సమాచార హక్కుపై నిరంకుశ ప్రభుత్వం చేస్తున్న పిరికి దాడి” అని కూడా ఆయన ఆరోపించారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను పలుచన చేసిందని పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఆ అభియోగాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. మోడీ ప్రభుత్వం పారదర్శకత గురించి పట్టించుకోని సిగ్గుమాలిన పని చేస్తోందని ఆరోపించారు మల్లికార్జున్ ఖర్గే.