తెలంగాణ నూతన సచివాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చిలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై కూడా హాజరు కానున్నారు. నూతన సచివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పటివరకు గవర్నర్ సందర్శించలేదు.
గురువారం రాజ్భవన్లో నిర్వహించిన పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గవర్నర్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ శుక్రవారం జరగనున్న ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తమిళిసైను ఆహ్వానించినట్లుగా తెలిసింది. సానుకూలంగా స్పందించిన ఆమె, అందుకు అంగీకరించినట్లు సమాచారం. ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం అనంతరం గవర్నర్ తమిళిసై సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలను పరిశీలించనున్నారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీఎస్ ఎ.శాంతికుమారి గురువారం రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గత రెండ్రోజులుగా నల్ల పోచమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, సీఎస్ శాంతికుమారి వేర్వేరుగా పాల్గొన్నారు.