రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. దాదాపు కిలో టమాట కొన్ని ప్రాంతాల్లో రూ.300 వరకు పలికింది. రెండు నెలలుగా మధ్యతరగతి ఇంట్లో టమాట మాటే వినిపించలేదు. అయితే టమాట ధరలు నెమ్మదిగా తగ్గుతాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఒక్కసారిగా పడిపోవడం మాత్రం రైతులకు షాక్ ను కలిగిస్తోంది.
మొన్నటి దాక కిలో టమాట రూ.200, రూ.250 వరకు ఉండగా.. ఇప్పుడు మాత్రం చాలా చోట్ల కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. కొన్ని చోట్ల రూ.50 కూడా ఉంది. అయితే ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అంటే.. కిలోకు రూ.10 కూడా దక్కలేదని రైతులు వాపోయారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు.. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం కిలో టమాటాకు రూ.30-40 వరకు వెచ్చించక తప్పడం లేదు.