స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు.. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్కును కేసీఆర్ ప్రారంభిస్తారు.
రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల వద్ద 360 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును అభివృద్ధి చేశారు. ఈ పార్కు.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది.
స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల పరిశీలించారు. హరితహారంలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతంలో గుంతలు తవ్వాలని, తగిన ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి అధికారులను ఆదేశించారు.