చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో అక్కడి సర్కార్ దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా అమ్మాయిలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు రివార్డు అందించాలని నిర్ణయించింది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
యువతులు తగిన వయసులో వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్ నగదు ప్రోత్సాహకాన్ని తీసుకువచ్చింది. 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు మొదటి వివాహం అయితే నగదు పథకం కింద.. వెయ్యి యువాన్లు ఇస్తుంది. ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది. 140 కోట్లకు పైగా జనాభా కలిగిన చైనా ప్రస్తుతం.. తగ్గిపోతున్న జననాల రేటుతో కలవర పడుతోంది. చైనాలో స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు 20, 22 ఏళ్లుగా ఉంది.