మద్యం వ్యాపారులకు తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌బీసీఎల్) సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపారులు ఎంత మద్యం కావాలంటే అంత అప్పుగా తీసుకోవచ్చంటూ సూపర్ ఆఫర్ ఇచ్చింది. కావాల్సినంత మొత్తానికి పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చి మద్యం తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . అయితే చెక్కులు సెప్టెంబరు 30లోపు చెల్లుబాటయ్యేలా ఉండాలంటూ షరతు విధించింది. అంటే మద్యాన్ని తీసుకెళ్లే వ్యాపారులు అందుకు సంబంధించిన సొమ్మును సెప్టెంబరు నెలాఖరులోపు కట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా వ్యాపారులు ఎంత చలానా కడితే అంతమొత్తం మద్యాన్నే డిపోల నుంచి దుకాణాలకు లిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే.. కట్టిన చలానాకు అదనంగా 50 శాతం మద్యాన్ని అప్పుగా తీసుకెళ్లొచ్చంటూ రెండు రోజుల క్రితం కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. అంటే ఒక వ్యాపారి రూ.20 లక్షలకు చలానా తీస్తే రూ.25 లక్షల విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లవచ్చు. మిగిలిన రూ.5 లక్షలకు పోస్ట్ డేటెడ్ చెక్కు ఇవ్వాలి. ఈ ఆఫర్ సెప్టెంబరు 5లోపు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.