“ఇండియా” టీమ్‌లో క‌మ‌ల్ హాస‌న్ !

-

తమిళనాట రాజకీయం నానాటికీ హీటెక్కుతోంది. త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోంది. బ‌లం పెంచుకోవ‌డానికి చేయాల్సిన ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లం కావ‌డం లేదు. కానీ ఈసారి ఎలాగైనా కొన్ని సీట్లు అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. అయితే క‌మ‌లాన్ని కాలు కూడా పెట్ట‌నీయ‌కుండా అన్ని ప్ర‌ధాన‌పార్టీలు న‌డుం బిగించేశాయి. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌ని కీల‌క‌మైన విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చేశాయి. ఇండియా కూట‌మిగా ఏర్ప‌డి కాషాయాన్ని సాగ‌నంపాల‌ని పోరాటం మొదలుపెట్టాయి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది హీరో, “మక్కల్‌ నీది మయ్యం” పార్టీ చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇండియా కూట‌మితో జ‌త క‌ట్టేందుకు క‌మ‌ల్ సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఆది నుంచి క‌మ‌లం పార్టీని క‌మ‌ల్ వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌త‌వాద సిద్దాంతాల‌ను సహించేది లేద‌ని బీజేపీపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగానూ, సోష‌ల్ మీడియా వేదిక‌గానూ మోడీ స‌ర్కారును ఏకి పారేస్తున్నారు. ఈ నేప‌ద్యంలో ఇండియా కూట‌మికి మద్ద‌తు తెలుపుతోన్న ఆయ‌న‌, ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతో పాటు బీజేపీని పీఠం నుంచి దించడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

అందులో భాగంగానే డీఎంకేతోనూ చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఒంట‌రిగా బ‌రిలోకి దిగే కంటే మిత్ర‌ప‌క్షంగా ఉండి రానున్న ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది క‌మ‌ల్ ఆలోచ‌న‌. అందుకే త‌మిళ‌నాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా టీమ్‌తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. క‌మ‌ల్ కి కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహిత సంబంధాలున్నాయి. భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌కు సంఘీబావం ప్ర‌క‌టించారు. రాహుల్ తో కలిసి న‌డ‌చి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. నాటి నుంచి జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ పార్టీకి మ‌రింత చేరువ‌య్యారు. బీజేపీని గ‌ద్దె దించ‌డంలో భాగ‌స్వామ్యం కావ‌డంతో పాటు రాజ‌కీయంగా బ‌లంగా ఎద‌గవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తోనే ఇండియా కూట‌మితో జ‌త క‌ట్టేందుకు సిద్ద‌మ‌య్యారు క‌మ‌ల్.

Read more RELATED
Recommended to you

Latest news