తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అంతే కాకుండా ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘుమారెడ్డి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. వర్షాల వల్ల విద్యుత్ పరికరాలు, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలని సూచించారు. విద్యుత్ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ వద్దకు చేరజేయవచ్చని వెల్లడించారు. వాన తగ్గే వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పారు.