ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ X(ట్విటర్)లో భారత్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన రాజకీయ నేతల్లో ఉత్తర్ ప్రదేశ్ సీఎం చేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల తర్వాత స్థానమైన మూడో స్థానంలో యోగి నిలిచారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య బుధవారం 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది. లక్నోలోని యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సీఎంఓ ప్రకారం.. దేశంలో అత్యధిక మంది ట్విటర్ ఫాలోవర్లు కలిగిన మూడో రాజకీయ నేతగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, అనేక దేశాల అధినేతలతో పోల్చితే.. ట్విటర్లో యోగికి ఉన్న ప్రజాదరణ ఎక్కువని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ’30 రోజుల్లో అత్యధిక మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తులు, సంస్థల జాబితాను X ఇటీవల విడుదల చేసింది. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తర్వాత రెండో స్థానంలో యోగి నిలిచారు. నెల రోజుల వ్యవధిలో యోగి ఫాలోవర్స్ సంఖ్య 2లక్షల 67 వేల 419 మేర పెరిగింది.’ అని యూపీ సీఎంఓ తన ప్రకటనలో పేర్కొంది.