రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ప్రత్యేకమైన నియోజకవర్గంగా పిఠాపురాన్ని చెప్పుకుంటారు. రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు ఉన్న నియోజకవర్గ పిఠాపురం. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచారు. టిడిపి తరఫున పోటీ చేసి వర్మ ఓటమిని చవిచూశారు. 2014లో టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి వర్మ విజయాన్ని సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు .
వైసిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, సామాజిక వర్గ సమీకరణాలు తనకు కలిసి వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆశిస్తుంటే, నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఈసారి తానే విజయం సాధిస్తానని వర్మ ధీమాతో ఉన్నారు. వీరిద్దరి అభిప్రాయాలు ఇలా ఉంటే ఇందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వాదన వినిపిస్తోంది .
పిఠాపురంలో మెగా అభిమానులు, జనసేన వీరాభిమానులు కూడా ఉన్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇవి అన్ని చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలుపు సాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన, టిడిపి పొత్తు ఉంటే మాత్రం జనసేన అడిగిన కొన్ని నియోజకవర్గాల్లో పిఠాపురం ప్రధానమైనది, ముఖ్యమైనది.
టిడిపి తో పొత్తు ఉన్నా లేకపోయినా జనసేన గెలుపు పిఠాపురంలో ఖాయమని జనసేన అభిమానులు చెబుతున్నారు. టిడిపి జనసేన మధ్య పొత్తు కుదిరితే కచ్చితంగా పిఠాపురం ని జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి టిడిపి తరఫున బరిలో ఉన్న వర్మ ఏం చేస్తారో అని వర్మ వర్గీయులంతా ఆలోచనలో ఉన్నారు. అప్పుడు వర్మ అధిష్టాన నిర్ణయానికి ఒప్పుకుంటారా? లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారు చూడాల్సిందే .
పవన్ కళ్యాణ్ బరిలో దిగితే వైసీపీ తన అభ్యర్థిని మార్చాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా వంగా గీతను కూడా నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభంని వైసీపీలోకి తీసుకుని పిఠాపురంలో నిలబడతారనే టాక్ ఉంది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు సీటు డౌట్.
అటు టిడిపి-జనసేన పొత్తు ఉంటూ..పవన్ పోటీ చేస్తే టిడిపి నుంచి అభ్యంతరం ఉండదు. అలా కాకపోతే ఈ సీటు వదులుకోవడానికి టిడిపి రెడీగా ఉండదు. ఏది ఏమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి బిఫారం ఇచ్చేవరకు పిఠాపురం నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారా అనే విషయం మాత్రం సస్పెన్స్ !