స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ పోలీసులు రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది టీడీపీ. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ.. జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం బంద్కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అచ్చెన్నాయుడు కోరారు. మరోవైపు టీడీపీకి జనసేన తన మద్దతు ప్రకటించింది. చంద్రబాబుకు తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.