తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుమల నడక మార్గంలో వన్యమృగాల సంచారం భక్తుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇటీవలే చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి టీటీడీ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల అలిపిరి నడకమార్గంలో వన్యమృగాలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు. వాటి కోసం కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాలుగైదు చిరుతలను పట్టుకున్నారు.
ఇక తాజాలో తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలో 2వేల మెట్టు వద్ద బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు వెల్లడించారు. భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోమవారం రోజున తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దిగే ఘాట్ రోడ్డులోని 15వ మలుపు వద్ద భక్తులకు మధ్యాహ్న సమయంలో చిరుత కంట పడింది. వెంటనే అటవీశాఖ సిబ్బందికి టీటీడీ అధికారులు సమాచారం అందించారు.