తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఓవైపు అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్ చేస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ 26 మందితో ప్రత్యేక కమిటీని నియమించింది. ఐదుగురు కేంద్ర మంత్రులు, ఏపీ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల ముఖ్యనేతలను పార్టీ భాగస్వాములను చేసింది. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కి కమిటీలో స్థానం కల్పించింది.
ఈ కమిటీలోని సభ్యులు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపికలో సాయం చేస్తారని పార్టీ వెల్లడించింది. బహిరంగ సభలు నిర్వహించడం.. ఓటర్లను ఆకర్షించే దిశగా వీరు పనిచేస్తారని తెలిపింది. ఈ కమిటీ సభ్యులు తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ పూర్తి సమయాన్ని కేటాయించాలని పార్టీ ఆదేశించినట్లు తెలిసింది. అక్టోబరు ఒకటి, మూడు తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగసభల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలు హైదరాబాద్ చేరుకుని అప్పగించిన కీలక బాధ్యతలను నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.