వరల్డ్ కప్ 2023లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్యే జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అక్టోబర్ 14వ తేదీన జరిగే ఈ మ్యాచ్‌కు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. 11వేల మంది సిబ్బంది ఈ వేదిక వద్ద పహారా కాయనున్నారు.
అహ్మదాబాద్ నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అహ్మదాబాద్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. స్థానిక పోలీసులు, హోమ్ గార్డులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్- ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. 7000 వేల మంది పోలీసులతో పాటు మరో 4000 మంది హోంగార్డులను మోహరించినట్లు వివరించారు.
లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్న నేపథ్యంలో.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) వంటి దాడులు జరిగినా వెంటనే స్పందించేలా భద్రత కల్పిస్తున్నట్లు జీఎస్ మాలిక్ వివరించారు.