కేసీఆర్‌ వల్లే ప్రతి ఇంటికీ వాటర్ కనెక్షన్‌ సాధ్యమైంది: కేటీఆర్‌

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం షురూ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ముందు నుంచే బలంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక షెడ్యూల్ విడుదల తర్వాత ప్రచారంలో జోరు మరింత పెంచింది. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. సుడిగాలి పర్యటనలు చేస్తూ.. రోడ్ షోలు.. ఆత్మీయ సమ్మేళనాలతో ఓవైపు కార్యకర్తల్లో జోష్ పెంచుతూ.. మరోవైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మంత్రి కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియాలోనూ ప్రచార హవా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. తాజాగా కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఇంటికి తాగు నీటి కనెక్షన్‌ను అందించేందుకు ‘‘మిషన్ భగీరథ’’ పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియన్ ఇండెక్స్‌ అనే సంస్థ ట్వీట్‌ చేయగా.. ఆ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.

దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. తెలంగాణ అగ్రస్థానంలో ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ది ఇండియన్ ఇండెక్స్ సంస్థ ట్వీట్​ను రీట్వీట్ చేస్తూ.. విజన్ ఉన్న కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్‌ అన్నారు. ఈ పథకం తెలంగాణలో విజయవంతమైన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని.. ఇవాళ తెలంగాణ ఏది చేస్తే మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news