ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని కచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు. తనొక్కడి కోసమే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల అన్నారు. పదవి అనేది ఒకరి సొత్తు కాదని.. ప్రజలు పెట్టే బిక్ష అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు వస్తాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
జమ్మికుంటలో జరగనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మరో రెండు మూడ్రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.