ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదటగా గ్రూప్-2 వాయిదా పడటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పారు. అయితే తాజాగా ప్రవళిక తల్లిదండ్రులు.. తమ కుమార్తెను ఓ యువకుడు వేధించేవాడని.. అతడి వేధింపులు తట్టుకోలేక తాను బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ప్రవళిక ఆత్మహత్యపై ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా స్పందించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఆమెది ఆత్మహత్య కాదని.. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించాయి. మరోవైపు యువతి మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ హితవు పలికింది. అయితే తాజాగా కరీంనగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.
“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబసభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కేటీఆర్ తెలిపారు.