జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణారెడ్డి తొందరపడి నుంచి 2009 నుంచి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని.. ఆయన రాకతో తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తోడుగా ఉన్నారని చెప్పారు. ఉద్యమనేతలు అందరూ తిరిగి పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పారు.
‘కొందరు నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారు. నోట్లకట్టలతో దొరికిన రేవంత్.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. రేవంత్ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది. కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చింది. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది అప్పటి టీఆర్ఎస్ పార్టీనే. సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా?’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.