ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీ ఆరంభం అవుతుండగా చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే నెలలో 14వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ అది భారత్‌లో కనిపించలేదు. ఇప్పుడు ఏర్పడే చంద్రగ్రహణం మాత్రం భారత్‌లోనూ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ సహా.. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘాన్ వంటి దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించనుందని తెలిపారు. ఇప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్ర గ్రహణం అని.. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుందని వెల్లడించారు.
చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేస్తున్నారు. ముఖ్యంగా చంద్రగ్రహణం సందర్భంగా నేడు యాదాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఇవాళ అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఏర్పడుతుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉ. 3.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు యాడా అధికారులు తెలిపారు. మరోవైపు భద్రాద్రి ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఇక ఏపీలోని శ్రీవారి ఆలయం కూడా ఇవాళ మూసివేస్తున్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. ఈరోజు రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసియనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించింది. తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గం.కు శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని పేర్కొంది.