కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కాకపోతే వ్యాపారం దెబ్బతింటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే.. హైదరాబాద్ అమరావతి మాదిరిగా అవుతుందని వారు భావిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ది రైతుల ఎజెండా అని.. కాంగ్రెస్, బీజేపీది బూతుల ఎజెండా అని అన్నారు. బూతులు మాట్లాడేవాళ్లు కాదు.. భవిష్యత్ నిర్మించే వాళ్లు రాష్ట్రానికి కావాలని తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు ఐటీ పరిశ్రమలు, మరోవైపు వ్యవసాయం అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ అని పునరుద్ఘాటించారు.
‘కాంగ్రెస్ పార్టీలాగా మోసం, ద్రోహం బీఆర్ఎస్లో ఉండవు. మాది అందర్నీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ. రాష్ట్రంలో కేసీఆర్‌లాంటి బలమైన నాయకత్వం ఉండాలో… దిల్లీకి, గుజరాత్‌కు గులాములైన బలహీనమైన నాయకత్వం ఉండాలో ప్రజలు ఆలోచించుకోవాలి. సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. ఇవన్నీ కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయి. హీరోలు సన్నీడియోల్, రజనీకాంత్‌లు హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు.’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు