నేడు జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

-

తెలంగాణ ఏర్పాటు నుంచి తొలి రెండు సార్లు అధికారం కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. తొమ్మిదినరేళ్లలో చేసిన అభివృద్ధి, కేసీఆర్ భరోసా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎలాగైనా కేసీఆర్​ హ్యాట్రిక్ సీఎం కావాలని పటిష్ఠ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని.. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే మోటార్లకు మీటర్లు పెడతారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇక గులాబీ బాస్ కేసీఆర్ కూడా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి తమ మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ.. వారికి ఓటేస్తే.. కేసీఆర్​కు ఓటేసినట్లేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news