3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ అనే ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత యువత 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. చాలా మంది నిపుణులు, వ్యాపార వేత్తలు మూర్తి వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే తాజాగా మూర్తి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మద్దతు పలికారు. ఆయన కామెంట్స్‌పై ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అసలు ఆయన అన్న దాంట్లో తప్పేం ఉందని ప్రశ్నించారు.
కొంతమంది ప్రజా ప్రతినిధులు వారంలో రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేస్తుంటారని మనీష్ తివారీ చెప్పారు. చివరగా తాను సండే హాలిడే ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదని.. ఎన్నికైనా, కాకపోయినా నియోజకవర్గంలో ఆదివారం పనిచేస్తామని తెలిపారు. ఇండియా నిజంగా గొప్ప శక్తిగా ఎదగాలంటే.. ఒకటి లేక రెండు తరాలు 70 గంటలపాటు పనిచేయడాన్ని ఒక నియమంగా మార్చుకోవాలని సూచించారు. ఉద్యోగులకు సరిపడా ఉపాధి ఉంటే.. వారానికి 70 గంటలు పని-ఒకరోజు సెలవు, ఏడాదికి 15 రోజులు వెకేషన్‌ను ఒక నిబంధనగా చేసుకోవాలని మనీశ్ తివారీ అన్నారు.