తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల సమయం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కూడా ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలన చేయనున్నారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఆ రోజు వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఈ నామినేషన్ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏం నియోజకవర్గం నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది కచ్చితంగా తేలనుంది.