తెలంగాణలో ఒకనీతి.. ఆంధ్రాలో ఒక నీతా.. బాబును కడిగేసిన వంశీ

-

త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించిన టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరును పూర్తిగా ఎండగట్టారు. చంద్రబాబు మొదటి నుంచి తెలంగాణలో ఒక నీతి.. ఆంధ్రాలో ఒక నీతి ప్రదర్శిస్తూ పార్టీని సర్వనాశనం చేశారని అన్నారు. ఏపీలో సమస్యపై పోరాడుతున్న చంద్రబాబు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎందుకు పోరాడటం లేదని గళమెత్తారు.

తెలంగాణలో పోరాడితే ఓటుకు నోటు కేసు బయటకు తీస్తారని చంద్రబాబు భయపడుతున్నారని వంశీ విమర్శించారు. హుజూర్‌నగర్‌లో తెదేపాకు కనీసం 2 వేల ఓట్లు కూడా రాలేదని వంశీ గుర్తు చేశారు. మంచిపనులను కూడా విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న వంశీ.. ప్రభుత్వాన్ని మొదటిరోజు నుంచే విమర్శించడం సరికాదన్నారు. జగన్ కు మద్దతిస్తే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదని.. కేసుల గురించి వైకాపాలో చేరడం లేదని ఆయన అన్నారు.

ధర్మపోరాట దీక్షలు చేసి ఏం సాధించగలిగారో చంద్రబాబు చెప్పాలని వల్లభనేని వంశీ అన్నారు. ప్రతి ఎన్నిక ముందు పొత్తు పెట్టుకుంటున్నాం.. తర్వాత వారినే తిడుతున్నామని గుర్తు చేశారు. జగన్‌పై ఎంత చెడుప్రచారం చేసినా ప్రజలు ఆమోదించి 151 సీట్లు ఇచ్చారన్న విషయాన్ని మరచిపోరాదన్నారు వంశీ. ఇసుక దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలు వాటివల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే వంశీ డిమాండ్ చేశారు.

వరదలు వస్తుంటే ఇసుక ఎలా తీస్తారో చెప్పాలన్నారు వంశీ. చెప్పుడు మాటలు విని చంద్రబాబు అటు బీజేపీని , జనసేనను దూరం చేసుకున్నారన్న వంశీ.. ఇదే ధోరణిలో ముందుకెళ్తే తెలంగాణలో లానే ఆంధ్రాలో కూడా పార్టీకి పుట్ట గతులుండవన్నారు. త్వరలోనే వైకాపాలో చేరుతున్నానని.. ప్రజలకు మంచి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ పదవికి రాజీనామా చేయాల్సి వస్తే….అందుకు సిద్ధమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news