తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ప్రగతిని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభ్యర్థులు ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు కూడా ఇచ్చాయి. తాజాగా మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కూడా ఇలాంటి ఫిర్యాదే వచ్చింది. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..?
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంగరగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లిన మంత్రికి స్థానిక మహిళలు మేళతాళాలు, డప్పచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అయితే మంత్రి.. మంగళహారతిలో నాలుగు వేల రూపాయలను ఉంచారు. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె డబ్బు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదు చేశారు.