రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో అప్పులు ఎక్కువయ్యాయని ఈటల చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు.
రాష్ట్రంలో అప్పులు ఎక్కువయ్యాయంటున్న ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాటికి సంతకం పెట్టింది మీరే కదా అని హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మర్కూక్, జగదేవపూర్, రాయపోల్ మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించిన హరీశ్ రఘునందన్ రావు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. హుజూరాబాద్ కంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన గజ్వేల్‌లో ఓట్లేలా అడుగుతారని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు.
“రాష్ట్ర అప్పులపై విమర్శించే అర్హత ఈటలకు లేదు. ఆర్థిక మంత్రిగా అప్పులకు సంతకం పెట్టింది మీరే కదా. హుజూరాబాద్ కంటే గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందింది. గజ్వేల్‌లో ఈటల ఓట్లెలా అడుగుతారు. ఈటల పార్టీ మారగానే మాట మార్చుతున్నారు. పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను మించిన గొప్ప నాయకుడు లేడన్న ఈటల పార్టీ మారగానే అబద్ధాలు మాట్లాడుతున్నారు.” అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.