న్యుమోనియాతో చైనా గజగజ.. అప్రమత్తమైన భారత్.. కేంద్రం కీలక ప్రకటన​

-

చైనాలో వందలాది మంది చిన్నారులు ఇన్‌ఫెక్షన్‌, శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారన్న విషయం ప్రస్తుతం ప్రపంచాన్ని మళ్లీ కలవరానికి గురి చేస్తోంది. ఆ దేశం నుంచి వచ్చిన కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని మరిచిపోతున్న తరుణంలో.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో మరో వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేయడం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలో అంతుచిక్కని న్యుమోనియా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది.

అయితే ఈ న్యుమోనియా కేసుల వల్ల భారతీయులకు తక్కువ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయినా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, గత కొన్ని వారాలుగా చైనాలో శ్వాసకోశ సమస్యల కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొంది.

మరోవైపు చైనాలో న్యుమోనియా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులకు సంబంధించిన సమాచారం అందించాలని ఆ దేశాన్ని కోరింది. అలాగే వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చైనా అధికారులను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news