తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బంది ఈ సామగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నాయి.
అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నవంబర్ 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు అన్నీ ఈ సెలవులు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ, రేపు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. అయితే పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలలు రేపు సెలవు ఇవ్వడం లేదని.. స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.