ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా సోమవారం రోజున తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, బాపట్ల, కృష్ణా, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. మంగళవారం రోజున దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా బలపడి నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930 కి.మీ, మచిలీపట్నానికి 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడి.. వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో తీరం దాటేందుకు అవకాశముందని చెప్పారు. ఈ క్రమంలో తుపాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు.