కాసేపట్లో ఖర్గేతో డీకే, ఠాక్రే భేటీ.. సీఎం అభ్యర్థి ఎవరో తేలేనా?

-

తెలంగాణలో స్పష్టమైన మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన, మంత్రివర్గ కూర్పుపై తలలు పట్టుకుంటోంది. ఆ పార్టీలో సీఎం ఎవరు? మంత్రులు ఎవరన్న దానిపై ఇప్పుడు కసరత్త చేస్తోంది. ఈ విషయంపైనే పార్టీ ఇంకా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే దిల్లీ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు.

ఇప్పటికే సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన పార్టీ.. సోమవారం రాత్రికి ప్రమాణస్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం చేసింది. కానీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో వాయిదా పడింది. నేడు ఖర్గేతో డీకే శివకుమార్‌, ఠాక్రే భేటీ అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిల్లీ వెళ్లారు. వారిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news