ఇండియా కూటమిలో విభేదాలు.. రేపు ఢిల్లీలో జరగాల్సిన మీటింగ్‌ వాయిదా..!

-

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 6న సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ మీటింగ్‌ వాయిదా పడింది. ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మీటింగ్‌ వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై చర్చిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చింది. డిసెంబర్‌ 6వ తేదీన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ మీటింగ్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.

దీదీ బాటలోనే మిగితా కూటమి నేతలు కూడా ఉన్నారు. సమాజ్‌ వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా ఇండియా కూటమి భేటీకి డుమ్మా కొట్టనున్నారు. ఆ ఇద్దరూ తమ ప్రతినిధుల్ని భేటీకి పంపనున్నట్లు తెలుస్తోంది. బుధ‌వారం జ‌రిగే ఇండియా బ్లాక్ భేటీకి వెళ్లే ఆలోచ‌న‌లో అఖిలేశ్ లేర‌ని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌద‌రీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news