మిగ్జాం తుపాను తమిళనాడు, ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో రైతులను అతలాకుతలం చేసింది. మరోవైపు ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనివల్ల ప్రజలు పగటి పూటే వణికిపోతున్నారు. రాత్రిపగలుకు తేడా లేకుండా పోయిందని అంటున్నారు. స్వెటర్, మఫ్లర్లు లేకుండా పగటిపూట కూడా బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
మరోవైపు గురువారం రోజున హనుమకొండ జిల్లాలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. మెదక్ జిల్లాలో 7.5, నిజామాబాద్‌లో 7, రామగుండంలో 5.6 డిగ్రీల సెల్సియస్‌లకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కన్నా రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఆదిలాబాద్‌లో డిసెంబరు మొదటి వారంలో దాదాపు 12.1 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వాల్సి ఉండగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 7.1 డిగ్రీల సెల్సియస్ అదనంగా 19.2 డిగ్రీలుగా నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో తుపాను పూర్తిగా బలహీన పడటంతో శుక్ర, శనివారాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.