తెలంగాణలో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. మొదటగా పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై పట్టు చీరల తయారీని ముర్ము పరిశీలించారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో ముచ్చటించారు. అనంతరం అక్కడే నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. చేనేత కళ విభిన్నమైందని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికుల కృషి అభినందనీయమని కొనియాడారు. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం వారు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసల జల్లు కురిపించారు. పోచంపల్లి చేనేత కార్మికులు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న ద్రౌపది ముర్ము తమ ప్రాంతం నుంచి పోచంపల్లికి కొంతమందిని తీసుకొస్తానని.. పట్టుచీరల తయారీని వారు కూడా తెలుసుకుంటారని చెప్పారు.