గత ప్రభుత్వం సుమారు 6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైల్ ప్రతిపాదనలని పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మార్గంలో ఓఆర్ఆర్ ఉన్నందున ఆ మార్గానికి బదులుగా ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి ప్రణాళిక చేయాలని నిర్దేశించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కి కలిపి అక్కడినుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదనలు చేయాలని తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలను మెరుగు పరచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులని ఆదేశించారు. ఎక్కువ మంది ప్రజలు, ప్రాంతాలకు ఉపయోగపడేలా విస్తరణ చేపట్టాలని స్పష్టం చేశారు. సవరించిన ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్‌కి డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయన నివేదికలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, మెట్రో రైలు నిర్మాణంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఆ సమావేశాల్లో వ్యక్తిగతంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. మెట్రోరైల్తోపాటు దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు 100అడుగుల రోడ్విస్తరణ ద్వారా నగరంలోని మిగతాప్రాంతాల మాదిరిగా పాతబస్తీ అభివృద్ధి చెందుతుందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రోడ్ విస్తరణ కోసం 103 చారిత్రక, మతపరకట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.