కొత్త ఏడాది తొలి రోజునే జపాన్ దేశాన్ని ప్రకృతి విపత్తు వణికించింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 62 మంది మృతులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భవన శిథిలాలను తొలగిస్తున్న అధికారులు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కేవలం ఒక్కరోజే 155 సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు వివరించారు.
అయితే జపాన్‌కు ఇవాళ మరో ముప్పు పొంచి ఉందని ఆ దేశ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
మరోవైపు జనవరి 1వ తేదీ సంభవించిన భూకంపం ధాటికి 62 మంది మరణించగా మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో 32వేల మంది నిరాశ్రయులుగా మారారని చెప్పారు. వారంతా పునరావాసాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు వివరించారు.