నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నుంచి త్వరలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రూ.4,902 కోట్ల వ్యయంతో 2022లో పోర్టుకు శంకుస్థాపన జరగగా, తొలి దశలో 34.04 MMTPA (మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనమ్) సామర్థ్యంతో ఒక బెర్త్ సిద్ధమైంది. ఆరు నెలల్లో మరో మూడు బెర్తులు రెడీ కానున్నాయి. ఎగుమతుల అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖకు ఏపీ మారి టైమ్ బోర్డు లేఖ రాసింది. ఈ నెలాఖరుకు తొలి నౌక వచ్చే అవకాశం ఉంది.
ఇక అటు ప్రపంచ పర్యాటకంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చిలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో విశాఖ నుంచి థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, మాల్దీవులకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.