టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం ఉందన్నారు ఎంపీ రఘురామ. తప్పులన్నీ చేసింది… ప్రజల్ని మోసగించింది… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారేనని, వైకాపా సర్వనాశనానికి తానే కారణమని తెలుసుకోకుండా ఇతరులపై రంకెలు వేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఒంటరిగా కూర్చుని జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని, అప్పుడైనా ఆయనలో పరివర్తన వస్తుందేమోనని చూడాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి గారి అహంకారం వల్లే రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోబోతుందని, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారు తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయా వర్గాల ప్రజాప్రతినిధులు రోడెక్కి చెప్పుకునే పరిస్థితిని నెలకొందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇవ్వడం లేదని నేరుగా చెప్పకుండా, ఐఏఎస్ అధికారులతో మాట్లాడించి జగన్ మోహన్ రెడ్డి గారు క్షమించరాని ఘోరమైన తప్పిదాన్ని చేస్తున్నారని, బస్మాసురుడి మాదిరిగా నెత్తిన చేయి పెట్టుకొని వాళ్లు కుంపటి పెడుతున్నారు… వీళ్లు కుంపటి పెడుతున్నారు అంటే ప్రయోజనం ఏమిటని మండిపడ్డారు.