తమ వేతనాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలపై జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించినట్లుగా రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగం చెల్లుతుందా?, చెల్లదా? అన్నదానిపై తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. గౌరవ వేతనంతో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలనుకోవడం దారుణం అని, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన దాఖలాలు లేవని, వారేమి ప్రభుత్వ సిబ్బంది కాదని, ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని వారు కోరుతున్నారని తెలిపారు.
ఒకవేళ వారి కోరిక సమంజసం కాకపోతే పిలిపించి మాట్లాడాలి… వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, నిర్లక్ష్యంగా నియంతలాగా, రాచరిక వ్యవస్థలో వ్యవహరించినట్లుగా వ్యవహరించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం సరికాదని అన్నారు. సచివాలయానికి నిత్యం వెళ్లకుండా ఏదో మంత్రి వర్గ సమావేశానికి మాత్రమే హాజరయిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని, ఇంట్లోనే కూర్చొని, అప్పుడప్పుడు బటను నొక్కే కార్యక్రమం పేరిట హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ, ప్రజలను, మంత్రులను, శాసన సభ్యులను కలవకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.