కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులను ఎంతో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సి ఉండగా రోడ్లపై గాల్లో ఎగురుతూ కనిపించాయి. దీంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్ల బారిన పడిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డేటా బహిర్గతం కావడంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు.
ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల ప్రజాపాలన దరఖాస్తులు బహిర్గతమైనట్లు వస్తున్న వార్తలను చూశానని ,ఆ దరఖాస్తులలో కోట్లాదిమంది తెలంగాణ ప్రజల సెన్సిటివ్ డేటా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎవరైనా కాల్ చేసి ఆరు గ్యారంటీలు మంజూరయ్యాయని.. ఓటీపీ అడిగితే చెప్పవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్కు ఓటు వేసినా.. ఓటు వేయకపోయినా సరే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలను సీరియస్గా తీసుకుని సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని కోరారు.