మాల్దీవ్స్ అధ్యక్షుడికి షాక్.. మాలె మేయర్‌ ఎన్నికల్లో భారత అనుకూల పార్టీ గెలుపు!

-

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీశాయి. ఈ టెన్షన్ సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఓడిపోయింది. భారత్ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) గెలుపొందింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అజీమ్ గెలవడాన్ని మాల్దీవుల మీడియా ‘అఖండ విజయం’గా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ సొలిహ్‌ నాయకత్వం వహిస్తుండగా.. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. మేయర్‌ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news