భారత్లో ఇప్పుడు ఎక్కడ చూసిన అయోధ్య రామ్ మందిర్ ముచ్చటే.. ఎక్కడ విన్నా జైశ్రీరామ్ నినాదమే. మరో వారం రోజుల్లో (జనవరి 22వ తేదీన) అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్లో శ్రీరాముడి ఫీవర్ షురూ అయింది. రాముడి పుస్తకాల విక్రయాలు పెరిగాయి. రామాయణం పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. రాముడి టాటూలు, రాముడి ఫేవరెట్ వంటకాలు, రాముడి బొమ్మల విక్రయాలు ఇలా రాముడికి సంబంధించిన ప్రతి దానికి గిరాకీ పెరిగింది.
అయితే శ్రీరాముడి ఫీవర్ కేవలం భారత్కే పరిమితం కాలేదు. ఈ ఫీవర్ విదేశాలకూ పాకింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలో విశ్వహిందూ పరిషత్ ప్రవాసీయులతో కలిసి ఓ వినూత్న ఈవెంట్ జరిపింది. మేరిల్యాండ్‌లోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో 150 టెస్లా కార్లతో మ్యూజికల్ లైట్ షోను నిర్వహించింది. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాటు రాముడి జెండాలను ప్రదర్శిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 21 నగరాల్లో ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తిస్తూ రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు. అట్లాంటా, బోస్టన్, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర నగరాల్లో వీహెచ్‌పీ అమెరికా ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ ర్యాలీలు జరిగాయి.