అయోధ్యలో మరో వారం రోజుల్లో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ బృహత్తర వేడుకకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రామ జన్మ మందిర ట్రస్ట్ అతిథులకు ఆహ్వానాలు కూడా పంపింది. ఇప్పటికే దేశంలోని పలువురు ప్రముఖులు, సినీతారలు, రాజకీయ నాయకులు వివిధ రంగాలకు చెందిన వారికి ఆహ్వానాలు అందగా విదేశీయులు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ప్రముఖులను ఆహ్వానం అందింది.
మరోవైపు అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను చూసేందుకు దేశవ్యాప్తంగా రామభక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులకు పంచేందుకు 45 టన్నుల లడ్డూ ప్రసాదం సిద్ధమవుతోంది. వారణాసికి చెందిన మిఠాయి తయారీదారులు ఇందుకోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, జీడిపప్పు, యాలకులు, కుంకుమ పువ్వుతో వీటిని ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. ఏకాభిప్రాయ సాధన తర్వాతే అయోధ్య రామాలయం నిర్మించాలని సూచించిన దివంగత సాధువు దేవ్రా బాబా తరఫున 1,111 లడ్డూలను రాముడికి నైవేద్యంగా సమర్పించనున్నట్లు వెల్లడించారు.