మళ్లీ రెచ్చిపోయారు.. యూఎస్‌ షిప్‌పై హౌతీ రెబల్స్ దాడి

-

అమెరికాపై హౌతీ రెబెల్స్‌ మరోసారి రెచ్చిపోయారు. యెమెన్‌ తీరంలో యూఎస్కు చెందిన కంటెయినర్‌ షిప్‌ గిబ్రాల్టర్‌ ఈగల్‌పై దాడులకు తెగబడ్డారు. యాంటి షిప్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేయడంతో షిప్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం గానీ, షిప్‌కు తీవ్రమైన నష్టంగానీ వాటిల్లలేదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. గల్ఫ్‌ ఆప్‌ ఎడెన్‌లో మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో కంటెయినర్‌ షిప్‌ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు అమెరికా ఆర్మీ తెలిపింది.

మరోవైపు ఈ దాడి చేసింది తామేనని యెమెన్‌ రెబల్‌ గ్రూప్‌ ప్రకటించుకుంది. తమ దేశంపై దాడికి దిగిన అమెరికా, బ్రిటిష్‌కు చెందిన యుద్ధ నౌకలను తాము శత్రు లక్ష్యాలుగా భావిస్తామని హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్య సరీ అన్నారు.

ఇటీవలే అమెరికా, బ్రిటన్ దేశాలు సంయుక్తంగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తమ నౌకలపై దాడులు మానకపోతే ఈ దాడులు మరింత తీవ్రం చేస్తాయని హౌతీలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఈ హెచ్చరికలను బేఖాతరు చేసిన హౌతీ రెబల్స్ తాజాగా అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news