రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు అయింది.
ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 18వ తేదీ రాత్రి నిర్వహించింది. అయితే కంపెనీ సీఈవో సంజయ్ షా(56), ప్రెసిడెంట్ విశ్వనాథరాజు(52)ను క్రేన్ నుంచి కిందకు దించుతుండగా, క్రేన్ తీగలు తెగిపోయాయి. దీంతో సంజయ్ షా, విశ్వనాథరాజు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
సంజయ్ షా మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. విశ్వనాథ రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విస్టెక్స్ ఆసియా కంపెనీ ఉద్యోగి జానకీ రాం రాజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిగా రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ను చేర్చి దర్యాప్తు చేపట్టారు.