అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ఇక జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది.
మరోవైపు ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో అయోధ్య ఆలయాన్ని పలురకాల పూలతో, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్ 2) నిర్మించిన ఆలయానికి తూర్పు వైపున ప్రవేశద్వారం ఉండగా, దక్షిణం వైపు నుంచి బయటకు రావాల్సి ఉంటుందని రామజన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. తూర్పు వైపున 32 మెట్లు ఎక్కి రావాలని సూచించారు. అయోధ్య రామమందిరానికి దారి తీసే రామ్పథ్లో గత గురువారం ‘రామ్జన్మభూమి’ పేరిట ప్రభుత్వరంగ బ్యాంకు శాఖ ప్రారంభమైంది.