ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యక్తి గత కారణాల వల్ల తొలి రెండు టెస్ట్ లకు దూరంగా ఉండనున్నాడని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. తాను అందుబాటులో ఉండలేకపోతున్నాననే విషయాన్ని కోహ్లి.. మేనేజ్ మెంట్, సెలెక్టర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా చెప్పాడని బీసీసీఐ మీడియాతో వెల్లడించింది.
దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని ఎల్లప్పుడూ ప్రధాన కర్తవ్యంగా భావించే కోహ్లి లాంటి ఆటగాడి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. అతడిని జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీసీసీఐ కోరింది. కోహ్లికి ప్రత్యామ్నాయ ఆటగాడిని త్వరలోనే ఎంపిక చేస్తామని పేర్కొంది. హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్ కి చేరుకున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో సైతం హ్యారీ బ్రూక్ వ్యక్తి గత కారణాల వల్ల ఈ సిరీస్ కి దూరమయ్యాడు.