ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బుధవారం రోజున రాజ్‌భవన్‌లో కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు గవర్నర్‌తో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించనున్న వేడుకలకు తమిళిసైని సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
మరోవైపు గవర్నర్‌తో భేటీలో ఇరువురు నేతలు పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అంతే కాకుండా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల విజ్ఞప్తులకు గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతోంది. పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్, సీఎం హాజరు కానున్న దృష్ట్యా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు.