రోజుకు రెండు మూడు శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క్ బడ్జెట్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రోజున సచివాలయంలో మహిళ, శిశు, పంచాయతీరాజ్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. అదే విధంగా వైద్యారోగ్య శాఖపై ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖకు 15 వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టిని కోరారు. మరోవైపు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, జూనియర్ వైద్యులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ శాఖపై సమీక్ష నిర్వహించిన అనంతరం భట్టి విక్రమార్క.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని తెలిపారు. మరోవైపు పర్యాటక, సాఫ్ట్ వేర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేసి మహిళ సాధికారతకు చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులను నిర్దేశించారు. హైదరాబాద్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చిన్నారులను అడ్డుపెట్టుకొని చేసే భిక్షాటనను అరికట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్త్రీ, శిశు, సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.