తెలంగాణ రైతులకు బిగ్ షాక్…ఖాతాలపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలోని 6.37 లక్షల మంది రైతుల ఖాతాలను బ్యాంకులు నిరర్థక ఆస్తులు గా నమోదు చేశాయి. తీసుకున్న రుణాలను దీర్ఘకాలంగా చెల్లించడం లేదనే కారణంతో ఈ ఖాతాలను ఎన్.పి.ఏ గా ప్రకటించాయి. ఈ జాబితాలోని రైతుల ఆస్తుల జప్తుతో పాటు మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఎన్.పి.ఏ అయిన రైతుల వివరాలపై బ్యాంకులు నివేదిక ఇచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 75,61,395 రైతు ఖాతాలు ఉండగా…. గత సెప్టెంబర్ వరకు అందులో 6,37,694 మంది రైతుల ఖాతాలను ఎన్.పి.ఏగా నమోదుచేసినట్లు వెల్లడించాయి. ఈ రైతుల నుంచి అసలు, వడ్డీ కలిపి రూ. 7,050 కోట్ల మేరకు వసూలు కావాల్సి ఉందని తెలిపాయి. రైతు ఖాతాల్లో మొత్తం 5.64% మేరకు ఎన్.పి.ఏ అయినట్లు వెల్లడించాయి.