చైనాకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉద్ఘాటించారు. మన పొరుగు దేశాలను చైనా ప్రభావితం చేయగలదనే విషయాన్ని అంగీకరించాల్సిందేనని అయినా అటువంటి పోటీ రాజకీయాలకు భయపడాల్సిన అవసరం భారత్కు లేదని తెలిపారు. మాల్దీవులపై చైనా ప్రభావం విషయంలో తాజాగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (IIM) ముంబయి విద్యార్థులతో జైశంకర్ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ముఖ్యంగా మాల్దీవుల విషయంపై విద్యార్థుల ప్రశ్నలకు బదులిస్తూ చైనా కూడా పొరుగు దేశమేనని, పోటీ రాజకీయాల్లో భాగంగా అనేక విధాలుగా ఆయా దేశాలను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. మనం చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ రాజకీయాలు పోటీతో కూడుకున్నవని.. ఎవరికి సాధ్యమైన కృషి వాళ్లు చేస్తారని చెప్పారు. మరోవైపు ఎర్ర సముద్రంలో భారత నౌకాదళం చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సామర్థ్యం నౌకాదళానికి ఉందనే విషయాన్ని ఇది చాటిచెబుతోందని వెల్లడించారు.